Not seeing a Scroll to Top Button? Go to our FAQ page for more info.

Monday, September 30, 2013

1వ సమూయేలు 1

1Sa 1:1  ఎఫ్రాయిము మన్యమందు రామతయిమ్సోఫీము పట్ట ణపువాడు ఒకడుండెను; అతని పేరు ఎల్కానా. అతడు ఎఫ్రాయీమీయుడైన సూపునకు పుట్టిన తోహు కుమారుడైన ఎలీహునకు జననమైన యెరోహాము కుమారుడు, అతనికి ఇద్దరు భార్యలుండిరి. 
1Sa 1:2  వీరిలో ఒకదాని పేరు హన్నా రెండవదాని పేరు పెనిన్నా. పెనిన్నాకు పిల్లలు కలిగిరి గాని హన్నాకు పిల్లలులేకపోయిరి. 
1Sa 1:3  ఇతడు షిలోహునందున్న సైన్యముల కధిపతియగు యెహోవాకు మ్రొక్కుటకును బలి అర్పించుటకును ఏటేట తన పట్టణము విడిచి అచ్చటికి పోవుచుండెను. ఆ కాలమున ఏలీయొక్క యిద్దరు కుమారులగు హొప్నీ ఫీనెహాసులు యెహోవాకు యాజకులుగా నుండిరి. 
1Sa 1:4  ఎల్కానా తాను బల్యర్పణ చేసిననాడు తన భార్యయగు పెనిన్నాకును దాని కుమారులకును కుమార్తెలకును పాళ్లు ఇచ్చుచు వచ్చెను గాని 
1Sa 1:5  హన్నా తనకు ప్రియముగా నున్నందున ఆమెకు రెండుపాళ్లు ఇచ్చుచు వచ్చెను. యెహోవా ఆమెకు సంతులేకుండచేసెను. 
1Sa 1:6  యెహోవా ఆమెకు సంతులేకుండ చేసియున్న హేతువునుబట్టి, ఆమె వైరి యగు పెనిన్నా ఆమెను విసికించుటకై, ఆమెకు కోపము పుట్టించుచు వచ్చెను. 
1Sa 1:7  ఎల్కానా ఆమెకు ఏటేట ఆ రీతిగా చేయుచు నుండగా హన్నా యెహోవా మందిరమునకు పోవునపుడెల్ల అది ఆమెకు కోపము పుట్టించెను గనుక ఆమె భోజనము చేయక ఏడ్చుచు వచ్చెను. 
1Sa 1:8  ఆమె పెనిమిటియైన ఎల్కానాహన్నా, నీ వెందుకు ఏడ్చు చున్నావు? నీవు భోజనము మానుట ఏల? నీకు మనో విచారమెందుకు కలిగినది? పదిమంది కుమాళ్లకంటె నేను నీకు విశేషమైనవాడను కానా? అని ఆమెతో చెప్పుచు వచ్చెను. 
1Sa 1:9  వారు షిలోహులో అన్నపానములు పుచ్చుకొనిన తరువాత హన్నా లేచి యాజకుడైన ఏలీ మందిర స్తంభము దగ్గరనున్న ఆసనముమీద కూర్చునియుండగా 
1Sa 1:10  బహుదుఃఖా క్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థనచేయుచు బహుగా ఏడ్చుచు 
1Sa 1:11  సైన్యములకధి పతివగు యెహోవా, నీ సేవకురాలనైన నాకు కలిగియున్న శ్రమను చూచి, నీ సేవకురాలనైన నన్ను మరువక జ్ఞాపకము చేసికొని, నీ సేవకురాలనైన నాకు మగ పిల్లను దయచేసినయెడల, వాని తలమీదికి క్షౌరపుకత్తి యెన్నటికి రానియ్యక, వాడు బ్రదుకు దినములన్నిటను నేను వానిని యెహోవావగు నీకు అప్పగింతునని మ్రొక్కుబడి చేసికొనెను. ఆమె యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచుండగా ఏలీ ఆమె నోరు కనిపెట్టుచుండెను, 
1Sa 1:12  ఏలయనగా హన్నాతన మనస్సులోనే చెప్పుకొనుచుండెను. 
1Sa 1:13  ఆమె పెదవులుమాత్రము కదలుచుండి ఆమె స్వరము వినబడక యుండెను గనుక ఏలీ ఆమె మత్తురాలైయున్న దనుకొని 
1Sa 1:14  ఎంతవరకు నీవు మత్తురాలవై యుందువు? నీవు ద్రాక్షారసమును నీయొద్దనుండి తీసివేయు మని చెప్పగా 
1Sa 1:15  హన్నా అది కాదు, నా యేలినవాడా, నేను మనోధుఃఖము గలదాననై యున్నాను; నేను ద్రాక్షారసమునైనను మద్యమునైనను పానము చేయలేదు గాని నా ఆత్మను యెహోవా సన్నిధిని కుమ్మరించు కొనుచున్నాను. 
1Sa 1:16  నీ సేవకురాలనైన నన్ను పనికిమాలిన దానిగా ఎంచవద్దు; అత్యంతమైన కోపకారణమునుబట్టి బహుగా నిట్టూర్పులు విడుచుచు నాలో నేను దీని చెప్పుకొనుచుంటిననెను. 
1Sa 1:17  అంతట ఏలీనీవు క్షేమముగా వెళ్లుము; ఇశ్రాయేలు దేవునితో నీవు చేసికొనిన మనవిని ఆయన దయచేయును గాక అని ఆమెతో చెప్పగా 
1Sa 1:18  ఆమె అతనితోనీ సేవకురాలనైన నేను నీ దృష్టికి కృప నొందుదునుగాక అనెను. తరువాత ఆ స్త్రీ తన దారిని వెళ్లిపోయి భోజనముచేయుచు నాటనుండి దుఃఖముఖిగా నుండుట మానెను. 
1Sa 1:19  తరువాత వారు ఉదయమందు వేగిరమే లేచి యెహోవాకు మ్రొక్కి తిరిగి రామాలోని తమ యింటికి వచ్చిరి. అంతట ఎల్కానా తన భార్య యగు హన్నాను కూడెను, యెహోవా ఆమెను జ్ఞాపకము చేసికొనెను 
1Sa 1:20  గనుక హన్నా గర్భము ధరించి దినములు నిండినప్పుడు ఒక కుమారుని కనినేను యెహోవాకు మ్రొక్కుకొని వీనిని అడిగితిననుకొని వానికి సమూయేలను పేరు పెట్టెను. 
1Sa 1:21  ఎల్కానాయును అతనియింటి వారందరును యెహోవాకు ఏటేట అర్పించు బలి నర్పిం చుటకును మ్రొక్కుబడిని చెల్లించుటకును పోయిరి. 
1Sa 1:22  అయితే హన్నాబిడ్డ పాలు విడుచువరకు నేను రాను; వాడు యెహోవా సన్నిధిని అగుపడి తిరిగి రాక అక్కడనే ఉండునట్లుగా నేను వాని తీసికొనివత్తునని తన పెనిమిటితో చెప్పి వెళ్లక యుండెను. 
1Sa 1:23  కాబట్టి ఆమె పెనిమిటియైన ఎల్కానానీ దృష్టికి ఏది మంచిదో అది చేయుము; నీవు వానికి పాలు మాన్పించు వరకు నిలిచి యుండుము, యెహోవా తన వాక్యమును స్థిరపరచును గాక అని ఆమెతో అనెను. కాగా ఆమె అక్కడనే యుండి తన కుమారునికి పాలు మాన్పించు వరకు అతని పెంచుచుండెను. 
1Sa 1:24  పాలు మాన్పించిన తరువాత అతడు ఇంక చిన్నవాడై యుండగా ఆమె ఆ బాలుని ఎత్తికొని మూడు కోడెలను తూమెడు పిండిని ద్రాక్షారసపు తిత్తినితీసికొని షిలోహులోని మందిరమునకు వచ్చెను. 
1Sa 1:25  వారు ఒక కోడెను వధించి, పిల్లవానిని ఏలీయొద్దకు తీసికొనివచ్చి నప్పుడు ఆమె అతనితో ఇట్లనెను 
1Sa 1:26  నా యేలినవాడా, నాయేలిన వాని ప్రాణముతోడు, నీయొద్దనిలిచి, యెహోవాను ప్రార్థనచేసిన స్త్రీని నేనే. 
1Sa 1:27  ఈ బిడ్డను దయచేయుమని యెహోవాతో నేను చేసిన మనవిని ఆయన నా కనుగ్రహించెను. 
1Sa 1:28  కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను; తాను బ్రదుకు దినములన్నిటను వాడు యెహోవాకు ప్రతిష్ఠితుడని చెప్పెను. అప్పుడు వాడు యెహోవాకు అక్కడనే మ్రొక్కెను. 

1వ సమూయేలు 2

1Sa 2:1  మరియు హన్నా విజ్ఞాపనచేసి యీలాగనెను నా హృదయము యెహోవాయందు సంతోషించుచున్నది. యెహోవాయందు నాకు మహా బలముకలిగెనునీవలని రక్షణనుబట్టి సంతోషించుచున్నానునావిరోధులమీద నేను అతిశయపడుదును. 
1Sa 2:2  యెహోవావంటి పరిశుద్ధ దేవుడు ఒకడునులేడు నీవు తప్ప మరి ఏ దేవుడును లేడుమన దేవునివంటి ఆశ్రయదుర్గమేదియు లేదు. 
1Sa 2:3  యెహోవా అనంతజ్ఞానియగు దేవుడు ఆయనే క్రియలను పరీక్షించువాడుఇకను అంత గర్వముగా మాటలాడకుడిగర్వపుమాటలు మీ నోట రానియ్యకుడి. 
1Sa 2:4  ప్రఖ్యాతినొందిన విలుకాండ్రు ఓడిపోవుదురుతొట్రిల్లినవారు బలము ధరించుదురు. 
1Sa 2:5  తృప్తిగా భుజించినవారు అన్నము కావలెనని కూలికిపోవుదురుఆకలి గొనినవారు ఆకలితీర తిందురు గొడ్రాలు ఏడుగురు పిల్లలను కనును అనేకమైన పిల్లలను కనినది కృశించి పోవును. 
1Sa 2:6  జనులను సజీవులనుగాను మృతులనుగాను చేయువాడు యెహోవాయేపాతాళమునకు పంపుచు అందులోనుండి రప్పించుచుండువాడు ఆయనే. 
1Sa 2:7  యెహోవా దారిద్ర్యమును ఐశ్వర్యమును కలుగజేయు వాడు క్రుంగజేయువాడును లేవనెత్తువాడును ఆయనే. 
1Sa 2:8  దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టుటకును మహిమగల సింహాసనమును స్వతంత్రింపజేయుటకును వారిని మంటిలోనుండి యెత్తువాడు ఆయనేలేమిగలవారిని పెంటకుప్పమీదినుండి లేవనెత్తు వాడు ఆయనే. భూమియొక్క స్తంభములు యెహోవా వశము, లోకమును వాటిమీద ఆయన నిలిపియున్నాడు. 
1Sa 2:9  తన భక్తుల పాదములు తొట్రిల్లకుండ ఆయన వారిని కాపాడునుదుర్మార్గులు అంధకారమందు మాటుమణుగుదురుబలముచేత ఎవడును జయము నొందడు. 
1Sa 2:10  యెహోవాతో వాదించువారు నాశనమగుదురుపరమండలములోనుండి ఆయన వారిపైన యురుమువలె గర్జించునులోకపు సరిహద్దులలో నుండువారికి ఆయన తీర్పు తీర్చునుతాను నియమించిన రాజునకు ఆయన బలమిచ్చునుతాను అభిషేకించినవానికి అధిక బలము కలుగజేయును. 
1Sa 2:11  తరువాత ఎల్కానా రామాలోని తన యింటికి వెళ్లి పోయెను; అయితే ఆ బాలుడు యాజకుడైన ఏలీ యెదుట యెహోవాకు పరిచర్యచేయుచుండెను. 
1Sa 2:12  ఏలీ కుమారులు యెహోవాను ఎరుగనివారై మిక్కిలి దుర్మార్గులైయుండిరి. 
1Sa 2:13  జనులవిషయమై యాజకులు చేయుచు వచ్చిన పని యేమనగా, ఎవడైన బలిపశువును వధించిన మీదట మాంసము ఉడుకుచుండగా యాజకుని వారు మూడు ముండ్లుగల కొంకిని తీసికొనివచ్చి 
1Sa 2:14  బొరుసులో గాని తపేలలోగాని గూనలోగాని కుండలోగాని అది గుచ్చినపుడు ఆ కొంకిచేత బయటకు వచ్చినదంతయు యాజకుడు తనకొరకు తీసికొనును. షిలోహుకు వచ్చు ఇశ్రాయేలీయులందరికిని వీరు ఈలాగున చేయుచువచ్చిరి. 
1Sa 2:15  ఇదియు గాక వారు క్రొవ్వును దహింపకమునుపు యాజ కుని పనివాడు వచ్చి బలిపశువును వధించువానితోయాజకునికి వండించుటకై మాంసమిమ్ము, ఉడకబెట్టిన మాంసము అతడు నీయొద్ద తీసికొనడు, పచ్చి మాంసమే కావలెను అని చెప్పుచువచ్చెను. 
1Sa 2:16  ఈ క్షణమందే వారు క్రొవ్వును దహింతురు, తరువాత నీ మనస్సు వచ్చి నంతమట్టుకు తీసికొనవచ్చునని వానితో ఆ మనిషి చెప్పిన యెడల వాడుఆలాగువద్దు ఇప్పుడే యియ్యవలెను, లేని యెడల బలవంతముచేత తీసికొందుననును. 
1Sa 2:17  అందువలన జనులు యెహోవాకు నైవేద్యము చేయుటయందు అసహ్య పడుటకు ఆ యౌవనులు కారణమైరి, గనుక వారిపాపము యెహోవా సన్నిధిని బహు గొప్పదాయెను. 
1Sa 2:18  బాలుడైన సమూయేలు నారతో నేయబడిన ఏఫోదు ధరించుకొని యెహోవాకు పరిచర్యచేయు చుండెను. 
1Sa 2:19  వాని తల్లి వానికి చిన్న అంగీ ఒకటి కుట్టి యేటేట బలి అర్పించుటకు తన పెనిమిటితోకూడ వచ్చినప్పుడు దాని తెచ్చి వాని కిచ్చుచు వచ్చెను. 
1Sa 2:20  యెహోవా సన్నిధిని మనవిచేసికొనగా నీకు దొరకిన యీ సంతానమునకు ప్రతిగా యెహోవా నీకు సంతానము నిచ్చునుగాక అని ఏలీ ఎల్కానాను అతని భార్యను దీవించిన తరువాత వారు ఇంటికి వెళ్లిరి. 
1Sa 2:21  యెహోవా హన్నాను దర్శింపగా ఆమె గర్భవతియై ముగ్గురు కుమాళ్లను ఇద్దరు కుమార్తెలను కనెను. అయితే బాలుడగు సమూయేలు యెహోవా సన్నిధిని ఉండి యెదుగుచుండెను. 
1Sa 2:22  ఏలీ బహు వృద్ధుడాయెను. ఇశ్రాయేలీయులకు తన కుమారులు చేసిన కార్యములన్నియు, వారు ప్రత్యక్షపు గుడారముయొక్క ద్వారము దగ్గరకు సేవ చేయుటకువచ్చిన స్త్రీలతో శయనించుటయను మాట చెవిని పడగా వారిని పిలిచి యిట్లనెను 
1Sa 2:23  ఈ జనులముందర మీరుచేసిన చెడ్డకార్యములు నాకు వినబడినవి. ఈలాటి కార్యములు మీరెందుకు చేయుచున్నారు? 
1Sa 2:24  నా కుమారు లారా, యీలాగు చేయవద్దు, నాకు వినబడినది మంచిది కాదు, యెహోవా జనులను మీరు అతిక్రమింపచేయు చున్నారు. 
1Sa 2:25  నరునికి నరుడు తప్పుచేసినయెడల దేవుడు విమర్శచేయునుగాని యెవరైన యెహోవా విషయములో పాపము చేసినయెడల వానికొరకు ఎవడు విజ్ఞాపనము చేయును? అనెను. అయితే యెహోవా వారిని చంప దలచి యుండెను గనుక వారు తమ తండ్రియొక్క మొఱ్ఱను వినకపోయిరి. 
1Sa 2:26  బాలుడగు సమూయేలు ఇంకను ఎదుగుచు యెహోవా దయయందును మనుష్యుల దయ యందును వర్ధిల్లుచుండెను. 
1Sa 2:27  అంతట దైవజనుడొకడు ఏలీయొద్దకు వచ్చియిట్లనెను యెహోవా నిన్నుగూర్చి సెలవిచ్చినదేమనగా, నీ పిత రుని యింటివారు ఐగుప్తు దేశమందు ఫరో యింటిలో ఉండగా నేను వారికి ప్రత్యక్షమైతిని. 
1Sa 2:28  అతడు నా ముందర ఏఫోదును ధరించి నా బలిపీఠముమీద అర్ప ణమును ధూపమును అర్పించుటకై నాకు యాజకుడగునట్లు ఇశ్రాయేలు గోత్రములలోనుండి నే నతని ఏర్పరచు కొంటిని. ఇశ్రాయేలీయులు అర్పించిన హోమవస్తువులన్నిటిని నీ పితరుని యింటివారికిచ్చితిని. 
1Sa 2:29  నా నివాస స్థలమునకు నేను నిర్ణయించిన బలి నైవేద్యములను మీరేల తృణీకరించుచున్నారు? మిమ్మును క్రొవ్వబెట్టుకొనుటకై నా జనులగు ఇశ్రాయేలీయులు చేయు నైవేద్యములలో శ్రేష్ఠభాగములను పట్టుకొనుచు, నాకంటె నీ కుమారులను నీవు గొప్ప చేయుచున్నావు. 
1Sa 2:30  నీ యింటి వారును నీ పితరుని యింటివారును నా సన్నిధిని యాజ కత్వము జరిగించుదురని యెహోవా ఆజ్ఞ యిచ్చియున్నను ఇప్పుడు అది నా మనస్సునకు కేవలము ప్రతికూలమాయెనని ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చు చున్నాడు. కావున యెహోవా వాక్కు ఏదనగానన్ను ఘనపరచువారిని నేను ఘనపరచుదును. నన్ను తృణీకరించువారు తృణీకారమొందుదురు. 
1Sa 2:31  ఆలకించుము; రాగల దినములలో నీ బలమును నీ పితరుని యింటి బలమును నేను తక్కువచేతును. నీ యింట ముసలివాడు ఒకడును లేకపోవును. 
1Sa 2:32  యెహోవా ఇశ్రాయేలీయులకు చేయదలచిన మేలువిషయములో నా నివాసస్థలమునకు అపాయము కలుగగా నీవు చూతువు. ఎప్పటికిని నీ యింట ముసలివాడు ఉండడు. 
1Sa 2:33  నా బలిపీఠమునొద్దనెవడు ఉండకుండ నేనందరిని నశింపజేయక విడుచు వాడను గనుక అది నీ కన్నులు క్షీణించుటకును నీవు దుఃఖముచేత క్షయమగుటకును సాధనమగును; నీ సంతానపు వారందరు వయఃకాలమందు మరణమవుదురు. 
1Sa 2:34  నీ యిద్దరు కుమారులైన హొఫ్నీకిని ఫీనెహాసునకును సంభ వించునని నేను చెప్పినదానికి నీకు సూచనగా నుండును. ఒక్క నాటియందే వారిద్దరు మరణమవుదురు. 
1Sa 2:35  తరువాత నమ్మక మైన ఒక యాజకుని నేను నియమింతును; అతడు నా యోచననుబట్టి నా కనుకూలముగా యాజకత్వము జరిగించును, అతనికి నేను నమ్మకమైన సంతానము పుట్టిం తును, అతడు నా అభిషిక్తుని సన్నిధిని ఎప్పటికిని యాజ కత్వము జరిగించును. 
1Sa 2:36  తరువాత నమ్మక మైన ఒక యాజకుని నేను నియమింతును; అతడు నా యోచననుబట్టి నా కనుకూలముగా యాజకత్వము జరిగించును, అతనికి నేను నమ్మకమైన సంతానము పుట్టిం తును, అతడు నా అభిషిక్తుని సన్నిధిని ఎప్పటికిని యాజ కత్వము జరిగించును. 

1వ సమూయేలు 3

1Sa 3:1  బాలుడైన సమూయేలు ఏలీయెదుట యెహోవాకుపరిచర్య చేయుచుండెను. ఆ దినములలో యెహోవా వాక్కు ప్రత్యక్షమగుట అరుదు, ప్రత్యక్షము తరుచుగా తటస్థించుటలేదు. 
1Sa 3:2  ఆ కాలమందు ఏలీ కన్నులు మంద దృష్టి గలవైనందున అతడు చూడలేక తనస్థలమందు పండు కొనియుండగాను 
1Sa 3:3  దీపము ఆరిపోకమునుపు సమూయేలు దేవుని మందసమున్న యెహోవా మందిరములో పండు కొనియుండగాను 
1Sa 3:4  యెహోవా సమూయేలును పిలిచెను. అతడుచిత్తమండి నేనున్నానని చెప్పి 
1Sa 3:5  ఏలీదగ్గరకు పోయినీవు నన్ను పిలిచితివి గదా నేను వచ్చినాననెను. అతడునేను పిలువలేదు, పోయి పండుకొమ్మని చెప్పగా అతడు పోయి పండుకొనెను. 
1Sa 3:6  యెహోవా మరల సమూ యేలును పిలువగా సమూయేలు లేచి ఏలీయొద్దకు పోయిచిత్తము నీవు నన్ను పిలిచితివి గనుక వచ్చితిననెను. అయితే అతడు నా కుమారుడా, నేను నిన్ను పిలువలేదు, పోయి పండుకొమ్మనెను. 
1Sa 3:7  సమూయేలు అప్పటికి యెహోవాను ఎరుగకుండెను, యెహోవా వాక్కు అతనికి ఇంక ప్రత్యక్షము కాలేదు. 
1Sa 3:8  యెహోవా మూడవ మారు సమూయేలును పిలువగా అతడు లేచి ఏలీ దగ్గరకు పోయిచిత్తము నీవు నన్ను పిలిచితివే; యిదిగో వచ్చితిననగా, ఏలీ యెహోవా ఆ బాలుని పిలిచెనని గ్రహించి 
1Sa 3:9  నీవు పోయి, పండుకొమ్ము, ఎవరైన నిన్ను పిలిచినయెడలయెహోవా, నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞనిమ్మని చెప్పుమని సమూయేలుతో అనగా సమూయేలు పోయి తన స్థలమందు పండుకొనెను. 
1Sa 3:10  తరువాత యెహోవా ప్రత్యక్షమై నిలిచి ఆ రీతిగాసమూయేలూ సమూ యేలూ, అని పిలువగా సమూయేలునీ దాసుడు ఆల కించుచున్నాడు ఆజ్ఞయిమ్మనెను. 
1Sa 3:11  అంతట యెహోవా సమూయేలుతో ఈలాగు సెలవిచ్చెనుఇశ్రాయేలులో నేనొకకార్యము చేయబోవుచున్నాను; దానిని వినువారందరి చెవులు గింగురుమనును. 
1Sa 3:12  ఆ దినమున ఏలీయొక్క యింటివారినిగురించి నేను చెప్పినదంతయు వారిమీదికి రప్పింతును. దాని చేయ మొదలుపెట్టి దాని ముగింతును. 
1Sa 3:13  తన కుమారులు తమ్మును తాము శాపగ్రస్తులగా చేసికొను చున్నారని తానెరిగియు వారిని అడ్డగించలేదు గనుక అతని యింటికి నిత్యమైన శిక్ష విధింతునని నేను అతనికి తెలియజేయుచున్నాను. 
1Sa 3:14  కాబట్టి ఏలీ యింటివారి దోషమునకు బలిచేతనైనను నైవేద్యముచేతనైనను ఎన్నటికిని ప్రాయశ్చిత్తము జేయబడదని నేను ప్రమాణపూర్వకముగా ఆజ్ఞా పించితిని. 
1Sa 3:15  తరువాత సమూయేలు ఉదయమగువరకు పండుకొని, లేచి యెహోవా మందిరపు తలుపులను తీసెనుగాని, భయపడి తనకు కలిగిన దర్శన సంగతి ఏలీతో చెప్పక పోయెను. 
1Sa 3:16  అయితే ఏలీసమూయేలూ నా కుమారుడా, అని సమూయేలును పిలువగా అతడు చిత్తము నేనిక్కడ ఉన్నాననెను. 
1Sa 3:17  ఏలీనీతో యెహోవా యేమి సెలవిచ్చెనో మరుగుచేయక దయచేసి నాతో చెప్పుము. ఆయన నీతో సెలవిచ్చిన సంగతులలో ఏదైన నీవు మరుగుచేసినయెడల అంతకంటె అధికమైన కీడు ఆయన నీకు కలుగజేయునుగాకని చెప్పగా 
1Sa 3:18  సమూయేలు దేనిని మరుగుచేయక సంగతి అంతయు అతనికి తెలియజెప్పెను. ఏలీ వినిసెలవిచ్చినవాడు యెహోవా; తన దృష్ఠికి అనుకూలమైనదానిని ఆయన చేయునుగాక అనెను. 
1Sa 3:19  సమూయేలు పెద్దవాడు కాగా యెహోవా అతనికి తోడైయున్నందున అతని మాటలలో ఏదియు తప్పిపోలేదు. 
1Sa 3:20  కాబట్టి సమూయేలు యెహోవాకు ప్రవక్తగా స్థిరపడెనని దాను మొదలుకొని బెయేర్షెబా వరకు ఇశ్రాయేలీయులందరు తెలిసికొనిరి 
1Sa 3:21  మరియు షిలోహులో యెహోవా మరల దర్శనమిచ్చుచుండెను. షిలోహులో యెహోవా తన వాక్కు చేత సమూయేలునకు ప్రత్యక్షమగుచు వచ్చెను. సమూయేలుమాట ఇశ్రాయేలీయులందరిలో వెల్లడియాయెను. 

1వ సమూయేలు 4

1Sa 4:1  ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయులతో యుద్ధము చేయు టకై బయలుదేరి ఎబెనెజరులో దిగగా ఫిలిష్తీయులు ఆఫెకులో దిగిరి. 
1Sa 4:2  ఫిలిష్తీయులు ఇశ్రాయేలీయులమీద తమ్మును యుద్ధపంక్తులుగా తీర్చుకొనగా వారు యుద్ధములో కలిసినప్పుడు ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయుల యెదుట ఓడిపోయి యుద్ధభూమిలోనే యెక్కువతక్కువ నాలుగు వేలమంది హతులైరి. 
1Sa 4:3  కాబట్టి జనులు పాళెములోనికి తిరిగిరాగా ఇశ్రాయేలీయుల పెద్దలు యెహోవా నేడు మనలను ఫిలిష్తీయులముందర ఎందుకు ఓడించెను? షిలోహులో నున్న యెహోవా నిబంధన మందస మును మనము తీసికొని మన మధ్య నుంచుకొందము రండి; అది మన మధ్యనుండినయెడల అది మన శత్రువుల చేతిలోనుండి మనలను రక్షించుననిరి. 
1Sa 4:4  కాబట్టి జనులు షిలోహునకు కొందరిని పంపి అక్కడనుండి కెరూ బులమధ్య ఆసీనుడైయుండు సైన్యముల కధిపతియగు యెహోవా నిబంధన మందసమును తెప్పించిరి. ఏలీయొక్క యిద్దరు కుమారులైన హొఫ్నీయును ఫీనెహాసును అక్కడనే దేవుని నిబంధన మందసమునొద్ద ఉండిరి. 
1Sa 4:5  యెహోవా నిబంధన మందసము దండులోనికి రాగా ఇశ్రాయేలీయులందరు భూమి ప్రతి ధ్వని నిచ్చునంత గొప్పకేకలు వేసిరి. 
1Sa 4:6  ఫిలిష్తీయులు ఆ కేకలు విని, హెబ్రీయుల దండులో ఈ గొప్ప కేకలధ్వని యేమని అడిగి, యెహోవా నిబంధన మందసము దండులోనికి వచ్చెనని తెలిసికొని 
1Sa 4:7  జడిసి దేవుడు దండులోనికి వచ్చెనని అనుకొని అయ్యో మనకు శ్రమ, ఇంతకుమునుపు వారీలాగు సంభ్రమింపలేదు, 
1Sa 4:8  అయ్యయ్యో మహాశూరు డగు ఈ దేవుని చేతిలోనుండి మనలను ఎవరు విడిపింప గలరు? అరణ్యమందు అనేకమైన తెగుళ్లచేత ఐగుప్తీయులను హతము చేసిన దేవుడు ఈయనే గదా. 
1Sa 4:9  ఫిలిష్తీయు లారా, ధైర్యము తెచ్చుకొని వారు మీకు దాసులైనట్టు మీరు హెబ్రీయులకు దాసులు కాకుండ బలాఢ్యులై యుద్ధము చేయుడని చెప్పుకొనిరి. 
1Sa 4:10  ఫిలిష్తీయులు యుద్దముచేయగా ఇశ్రాయేలీయులు ఓడిపోయి అందరు తమ డేరాలకు పరుగెత్తివచ్చిరి. అప్పుడు అత్యధికమైన వధ జరిగెను; ఇశ్రాయేలీయులలో ముప్పదివేల కాల్బలము కూలెను. 
1Sa 4:11  మరియు దేవుని మందసము పట్టబడెను; అదికాకను హొఫ్నీ ఫీనెహాసులను ఏలీయొక్క యిద్దరు కుమారులు హతులైరి. 
1Sa 4:12  ఆ నాడే బెన్యామీనీయుడొకడు యుద్ధభూమిలోనుండి పరుగెత్తివచ్చి, చినిగిన బట్టలతోను తలమీద ధూళితోను షిలోహులో ప్రవేశించెను. 
1Sa 4:13  అతడు వచ్చినప్పుడు ఏలీ మందసము విషయమై గుండె అవియుచు త్రోవప్రక్కను పీఠముమీద కూర్చుండి యెదురుచూచుచుండెను. ఆ మనుష్యుడు పట్టణములోనికి వర్తమానము తేగా పట్టణస్థులందరు కేకలు వేసిరి. 
1Sa 4:14  ఏలీ ఆ కేకలు వినిఈ గల్లత్తు యేమని అడుగగా ఆ మనుష్యుడు త్వరగా వచ్చి ఏలీతో సంగతి తెలియచెప్పెను. 
1Sa 4:15  ఏలీ తొంబది యెనిమిదేండ్లవాడై యుండెను. అతనికి దృష్టి మందగిలినందున అతని కండ్లు కానరాకుండెను. 
1Sa 4:16  ఆ మనుష్యుడుయుద్ధములోనుండి వచ్చినవాడను నేనే, నేడు యుద్ధములోనుండి పరుగెత్తి వచ్చితినని ఏలీతో అనగా అతడునాయనా, అక్కడ ఏమి జరిగెనని అడిగెను. 
1Sa 4:17  అందుకు అతడుఇశ్రాయేలీ యులు ఫిలిష్తీయులముందర నిలువలేక పారిపోయిరి; జను లలో అనేకులు హతులైరి; హొఫ్నీ ఫీనెహాసు అను నీ యిద్దరు కుమారులు మృతులైరి; మరియు దేవుని మందసము పట్టబడెను అని చెప్పెను 
1Sa 4:18  దేవుని మందసమను మాట అతడు పలుకగానే ఏలీ ద్వారముదగ్గర నున్న పీఠము మీదనుండి వెనుకకు పడి మెడవిరిగి చనిపోయెను; ఏల యనగా అతడు వృద్ధుడై బహు స్థూలదేహియై యుండెను. అతడు నలువది సంవత్సరములు ఇశ్రాయేలీయులకు న్యాయము తీర్చెను. 
1Sa 4:19  ఏలీ కోడలగు ఫీనెహాసు భార్యకు అప్పటికి గర్భము కలిగి కనుప్రొద్దులైయుండగా దేవుని యొక్క మందసము పట్టబడెననియు, తన మామయు తన పెనిమిటియు చనిపోయిరనియు ఆమె విని నొప్పులుతగిలి మోకాళ్లమీదికి క్రుంగి ప్రసవమాయెను. 
1Sa 4:20  ఆమె మృతినొందుచుండగా దగ్గర నిలిచియున్న స్త్రీలు ఆమెతోభయపడవద్దు, కుమారుని కంటివనిరి గాని ఆమె ప్రత్యుత్తరమియ్యకయు లక్ష్యపెట్టకయు నుండినదై 
1Sa 4:21  దేవుని మందసము పట్టబడినదను సంగతిని, తన మామయు పెనిమిటియు చనిపోయిన సంగతిని తెలిసికొని ప్రభావము ఇశ్రాయేలీయులలోనుండి పోయెనని చెప్పి తన బిడ్డకు ఈకాబోదు1 అను పేరు పెట్టెను. 
1Sa 4:22  దేవుని మందసము పట్టబడి పోయినందున ప్రభావము ఇశ్రాయేలీయులలోనుండి చెరపట్టబడి పోయెనని ఆమె చెప్పెను. 

1వ సమూయేలు 5

1Sa 5:1  ఫలిష్తీయులు దేవుని మందసమును పట్టుకొని ఎబెనె జరునుండి అష్డోదునకు తీసికొనివచ్చి 
1Sa 5:2  దాగోను గుడిలో దాగోను ఎదుట దాని నుంచిరి. 
1Sa 5:3  అయితే మరునాడు అష్డోదువారు ప్రాతఃకాలమందు లేవగా, ఇదిగో దాగోను యెహోవా మందసము ఎదుట నేలను బోర్లబడియుండెను కనుక వారు దాగోనును లేవనెత్తి వానిస్థానమందు మరల ఉంచిరి. 
1Sa 5:4  ఆ మరునాడు వారు ఉదయముననే లేవగా దాగోను యెహోవా మందసము ఎదుట నేలను బోర్లబడి యుండెను. దాగోనుయొక్క తలయు రెండు అరచేతులును తెగవేయబడి గడపదగ్గర పడియుండెను, వాని మొండెము మాత్రము వానికి మిగిలి యుండెను. 
1Sa 5:5  కాబట్టి దాగోను యాజకులేమి దాగోను గుడికి వచ్చు వారేమి నేటివరకు ఎవరును అష్డోదులో దాగోనుయొక్క గుడిగడపను త్రొక్కుటలేదు. 
1Sa 5:6  యెహోవా హస్తము అష్డోదువారిమీద భారముగా ఉండెను. అష్డోదువారిని దాని సరిహద్దులలో నున్న వారిని ఆయన గడ్డల రోగముతో మొత్తి వారిని హతము చేయగా 
1Sa 5:7  అష్డోదువారు సంభవించిన దాని చూచిఇశ్రాయేలీయుల దేవుని హస్తము మనమీదను మన దేవత యగు దాగోనుమీదను బహుభారముగా నున్నదే; ఆయన మందసము మనమధ్య నుండుటయే దీనికి కారణముగదా; అది యిక మన మధ్య నుండకూడదని చెప్పుకొని 
1Sa 5:8  ఫిలిష్తీయుల సర్దారు లందరిని పిలువనంపించిఇశ్రాయేలీ యుల దేవుని మందసమును మనము ఏమి చేయుదుమని అడిగిరి. అందుకు వారుఇశ్రాయేలీయుల దేవుని మంద సమును ఇక్కడనుండి గాతు పట్టణమునకు పంపుడని చెప్పగా, జనులు ఇశ్రాయేలీయుల దేవుని మందసమును అక్కడనుండి గాతునకు మోసికొని పోయిరి. 
1Sa 5:9  అయితే వారు అష్డోదునుండి గాతునకు దానిని మోసికొనిపోయిన తరువాత యెహోవా హస్తము ఆ పట్టణపు పెద్దలకు పిన్న లకును రహస్య స్థానములలో గడ్డలు లేపి వారిని మొత్తి, గొప్ప నాశనము జేసెను. 
1Sa 5:10  వారు దేవుని మందసమును ఎక్రోనునకు పంపివేయగా దేవుని మందసము ఎక్రోను లోనికి వచ్చినప్పుడు ఎక్రోనీయులు కేకలు వేసిమనలను మన జనులను చంపివేయవలెనని వీరు ఇశ్రాయేలీయుల దేవుని మందసమును మన యొద్దకు తీసికొని వచ్చిరనిరి. 
1Sa 5:11  కాగా జనులు ఫిలిష్తీయుల సర్దారులనందరి పిలువనంపించిఇశ్రాయేలీయుల దేవుని మందసము మనలను మన జను లను చంపకుండునట్లు స్వస్థానమునకు దానిని పంపించు డనిరి. దేవుని హస్తము అక్కడ బహు భారముగా ఉండెను గనుక మరణభయము ఆ పట్టణస్థులందరిని పట్టి యుండెను. 
1Sa 5:12  చావక మిగిలియున్నవారు గడ్డల రోగము చేత మొత్తబడిరి. ఆ పట్టణస్థుల కేకలు ఆకాశమువరకు వినబడెను. 

1వ సమూయేలు 6

1Sa 6:1  యహోవా మందసము ఏడు నెలలు ఫిలిష్తీయుల దేశమందుండిన తరువాత 
1Sa 6:2  ఫిలిష్తీయుల యాజకులను శకు నము చూచువారిని పిలువనంపించియెహోవా మందస మును ఏమి చేయుదుము? ఏమి చేసి స్వస్థలమునకు దానిని పంపుదుమో తెలియజెప్పుడనగా 
1Sa 6:3  వారుఇశ్రాయేలీయుల దేవుని మందసమును పంపివేయ నుద్దేశించినయెడల ఊరకయే పంపక, యే విధముచేతనైనను ఆయనకు అప రాధార్థమైన అర్పణము చెల్లించి పంపవలెను. అప్పుడు మీరు స్వస్థతనొంది ఆయన హస్తము మీ మీదనుండి యెందుకు తియ్యబడక యుండెనో మీరు తెలిసికొందు రనిరి. 
1Sa 6:4  ఫలిష్తీయులుమనము ఆయనకు చెల్లింపవలసిన అపరాధార్థమైన అర్పణమేదని వారినడుగగా వారుమీ అందరిమీదను మీ సర్దారులందరి మీదను ఉన్నతెగులు ఒక్కటే గనుక, ఫిలిష్తీయుల సర్దారుల లెక్క చొప్పున అయిదు బంగారపు గడ్డల రూపములను, అయిదు బంగారపు పందికొక్కులను చెల్లింపవలెను. 
1Sa 6:5  కాబట్టి మీకు కలిగిన గడ్డలుగాను భూమిని పాడుచేయు పంది కొక్కులుగాను నిరూపించబడిన గడ్డలను చుంచులను చేసి పంపించి ఇశ్రాయేలీయుల దేవునికి మహిమను చెల్లింప వలెను. అప్పుడు మీ మీదను మీ దేవతలమీదను మీ భూమిమీదను భారముగా నున్న తన హస్తమును ఆయన తీసివేయును కాబోలు. 
1Sa 6:6  ఐగుప్తీయులును ఫరోయును తమ హృదయములను కఠినపరచుకొనినట్లు మీ హృద యములను మీరెందుకు కఠినపరచుకొందురు? ఆయన వారిలో అద్భుతకార్యములను చేయగా వారు ఈ జనులను పోనిచ్చిరి; ఇశ్రాయేలీయులు వెళ్లిపోయిరి గదా. 
1Sa 6:7  కాబట్టి మీరు క్రొత్త బండి ఒకటి చేయించి, కాడిమోయని పాడి ఆవులను రెంటిని తోలితెచ్చి బండికి కట్టి వాటి దూడలను వాటి దగ్గరనుండి యింటికి తోలి 
1Sa 6:8  యెహోవా మందసమును ఆ బండిమీద ఎత్తి, అపరాధార్థముగా ఆయనకు మీరు అర్పింపవలసిన బంగారపు వస్తువులను దాని ప్రక్కనే చిన్న పెట్టెలో ఉంచి అది మార్గమున పోవునట్లుగా విడిచిపెట్టుడి. 
1Sa 6:9  అది బేత్షెమెషుకు పోవు మార్గమున బడి యీ దేశపు సరిహద్దు దాటిన యెడల ఆయనే యీ గొప్పకీడు మనకు చేసెనని తెలిసి కొనవచ్చును; ఆ మార్గమున పోనియెడల ఆయన మనలను మొత్తలేదనియు, మన అదృష్టవశముచేతనే అది మనకు సంభవించెననియు తెలిసికొందు మనిరి. 
1Sa 6:10  వారు ఆలా గున రెండు పాడి ఆవులను తోలితెచ్చి బండికి కట్టి వాటి దూడలను ఇంటిలోపల పెట్టి 
1Sa 6:11  యెహోవా మందసమును బంగారు గడ్డలును పందికొక్కు రూపములును గల ఆ చిన్న పెట్టెను బండిమీద ఎత్తగా 
1Sa 6:12  ఆ ఆవులు రాజ మార్గమునబడి చక్కగా పోవుచు అరచుచు, బేత్షెమెషు మార్గమున నడిచెను. ఫిలిష్తీయుల సర్దారులు వాటి వెంబ డియే బేత్షెమెషు సరిహద్దు వరకు పోయిరి. 
1Sa 6:13  బేత్షెమెషువారు లోయలో తమ గోధుమచేలను కోయుచుండిరి; వారు కన్నులెత్తి చూడగా మందసము వారికి కనబడెను, దానిని చూచి వారు సంతోషించిరి. 
1Sa 6:14  ఆ బండి బేత్షెమెషు వాడైన యెహోషువయొక్క పొలములోనికి వచ్చి అక్కడనున్న ఒక పెద్ద రాతిదగ్గర నిలువగా, వారు బండి యొక్క కఱ్ఱలను చీల్చి ఆవులను యెహోవాకు దహన బలిగా అర్పించిరి. 
1Sa 6:15  లేవీయులు యెహోవా మందసమును బంగారపు వస్తువులుగల ఆ చిన్న పెట్టెను దించి ఆ పెద్ద రాతిమీద ఉంచగా, ఆ దినమున బేత్షెమెషువారు యెహోవాకు దహనబలులను అర్పించి బలులను వధించిరి. 
1Sa 6:16  ఫిలిష్తీయుల సర్దారులు అయిదుగురు అంతవరకు చూచి నాడే ఎక్రోనునకు తిరిగి వెళ్లిరి 
1Sa 6:17  అపరాధార్థమైన అర్పణగా ఫిలిష్తీయులు చెల్లించిన బంగారపు గడ్డలు ఏవనగా, అష్డోదువారి నిమిత్తము ఒకటి, గాజావారి నిమిత్తము ఒకటి, అష్కెలోను వారి నిమిత్తము ఒకటి, గాతువారి నిమిత్తము ఒకటి, ఎక్రోనువారి నిమిత్తము ఒకటి. 
1Sa 6:18  ప్రాకారముగల పట్టణములవారేమి పొలములోని గ్రామములవారేమి ఫిలిష్తీయుల అయిదుగురు సర్దారుల పట్టణములన్నిటి లెక్క చొప్పున బంగారపు పంది కొక్కులను అర్పించిరి. వారు యెహోవా మందసమును దింపిన పెద్దరాయి దీనికి సాక్ష్యము. నేటివరకు ఆ రాయి బేత్షెమెషు వాడైన యెహోషువయొక్క పొలములో నున్నది. 
1Sa 6:19  బేత్షెమెషువారు యెహోవా మందసమును తెరచి చూడగా దేవుడు వారిని హతముచేసి ఆ జనులలో ఏబది వేల డెబ్బదిమందిని మొత్తెను. యెహోవా గొప్ప దెబ్బతో అనేకులను మొత్తగా జనులు దుఃఖా క్రాంతులైరి. 
1Sa 6:20  అప్పుడు బేత్షెమెషువారు పరిశుద్ధదేవుడైన యెహోవా సన్నిధిని ఎవరు నిలువగలరు? మనయొద్దనుండి ఆయన ఎవరియొద్దకు పోవలెనని చెప్పి 
1Sa 6:21  కిర్యత్యారీము కాపురస్థులకు దూతలను పంపిఫిలిష్తీయులు యెహోవా మందసమును మరల తీసికొని వచ్చిరి; మీరు వచ్చి మీ దాపునకు దానిని తీసికొని పోవలెనని వర్తమానము పంపిరి. 

1వ సమూయేలు 7

1Sa 7:1  అంతట కిర్యత్యారీమువారు వచ్చి యెహోవా మంద సమును తీసికొనిపోయి కొండయందుండే అబీనాదాబు ఇంట చేర్చి దానిని కాపాడుటకై అతని కుమారుడైన ఎలియాజరును ప్రతిష్ఠించిరి. 
1Sa 7:2  మందసము కిర్యత్యారీములోనుండిన కాలము ఇరువై సంవత్సరములాయెను. ఇశ్రాయేలీయులందరు యెహోవాను అనుసరింప దుఃఖించుచుండగా 
1Sa 7:3  సమూయేలు ఇశ్రాయేలీయులందరితో ఇట్లనెనుమీ పూర్ణహృదయ ముతో యెహోవాయొద్దకు మీరు మళ్లుకొనినయెడల, అన్యదేవతలను అష్తారోతు దేవతలను మీ మధ్యనుండి తీసి వేసి, పట్టుదలగలిగి యెహోవా తట్టు మీ హృదయములను త్రిప్పి ఆయ నను సేవించుడి. అప్పుడు ఆయన ఫిలిష్తీయుల చేతిలోనుండి మిమ్మును విడిపించును. 
1Sa 7:4  అంతట ఇశ్రాయేలీయులు బయలు దేవతలను అష్తారోతు దేవత లను తీసివేసి యెహోవాను మాత్రమే సేవించిరి. 
1Sa 7:5  అంతట సమూయేలుఇశ్రాయేలీయులందరిని మిస్పాకు పిలువనంపుడి; నేను మీపక్షమున యెహోవాను ప్రార్థన చేతునని చెప్పగా 
1Sa 7:6  వారు మిస్పాలో కూడు కొని నీళ్లుచేది యెహోవా సన్నిధిని కుమ్మరించి ఆ దినము ఉపవాసముండియెహోవా దృష్టికి మేము పాపాత్ములమని ఒప్పుకొనిరి. మిస్పాలో సమూయేలు ఇశ్రాయేలీ యులకు న్యాయము తీర్చుచువచ్చెను. 
1Sa 7:7  ఇశ్రాయేలీయులు మిస్పాలో కూడియున్నారని ఫిలిష్తీయులు విని నప్పుడు ఫిలిష్తీయుల సర్దారులు ఇశ్రాయేలుమీదికి వచ్చిరి. ఈ సంగతి ఇశ్రాయేలీయులు విని ఫిలిష్తీయులకు భయపడి 
1Sa 7:8  మన దేవుడైన యెహోవాను ఫిలిష్తీయుల చేతిలో నుండి మనలను రక్షించునట్లుగా మాకొరకు ఆయనను ప్రార్థనచేయుట మానవద్దని సమూయేలునొద్ద మనవి చేసిరి 
1Sa 7:9  సమూయేలు పాలు విడువని ఒక గొఱ్ఱపిల్లను తెచ్చి యెహోవాకు సర్వాంగ బలిగా అర్పించి, ఇశ్రాయేలీయుల పక్షమున యెహోవాను ప్రార్థనచేయగా యెహోవా అతని ప్రార్థన అంగీకరించెను. 
1Sa 7:10  సమూయేలు దహనబలి అర్పించుచుండగా ఫిలిష్తీయులు యుద్ధము చేయుటకై ఇశ్రాయేలీయుల మీదికి వచ్చిరి. అయితే యెహోవా ఆ దినమున ఫిలిష్తీయులమీద మెండుగా ఉరుములు ఉరిమించి వారిని తారుమారు చేయగా వారు ఇశ్రాయేలీయుల చేత ఓడిపోయిరి. 
1Sa 7:11  ఇశ్రాయేలీయులు మిస్పాలో నుండి బయలుదేరి బేత్కారు వరకు ఫిలిష్తీయు లను తరిమి హతము చేసిరి. 
1Sa 7:12  అప్పుడు సమూయేలు ఒక రాయి తీసి మిస్పాకును షేనుకును మధ్య దానిని నిలిపియింతవరకు యెహోవా మనకు సహాయము చేసెనని చెప్పి దానికి ఎబెనెజరు1 అను పేరు పెట్టెను. 
1Sa 7:13  ఈలాగున ఫిలిష్తీయులు అణపబడినవారై ఇశ్రాయేలు సరిహద్దులోనికి తిరిగి రాక ఆగిపోయిరి. సమూయేలు ఉండిన దినములన్నిటను యెహోవా హస్తము ఫిలిష్తీయులకు విరోధముగా ఉండెను. 
1Sa 7:14  మరియు ఫిలిష్తీయులు ఇశ్రాయేలీయుల యొద్దనుండి పట్టుకొనిన పట్టణములు ఇశ్రాయేలీయులకు తిరిగి వచ్చెను. ఎక్రోనునుండి గాతు వరకున్న గ్రామములను వాటి పొలములను ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయుల చేతిలోనుండి విడిపించిరి. మరియు ఇశ్రాయేలీయులకును అమోరీయులకును సమాధానము కలిగెను. 
1Sa 7:15  సమూయేలు తాను బ్రదికిన దినములన్నియు ఇశ్రాయేలీయులకు న్యాయాధిపతిగా ఉండెను. 
1Sa 7:16  ఏటేట అతడు బేతేలునకును గిల్గాలునకును మిస్పాకును తిరుగుచు ఆ స్థలములయందు ఇశ్రాయేలీయులకు న్యాయము తీర్చుచు వచ్చెను. 
1Sa 7:17  మరియు అతని యిల్లు రామాలోనుండినందున అచ్చటికి తిరిగివచ్చి అచ్చటకూడను న్యాయము తీర్చుచుండెను, మరియు అతడు అక్కడ యెహోవాకు ఒక బలిపీఠము కట్టెను.